ఆర్మూర్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘‘తెలంగాణ మాదిగ మహాసేన’’ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది రాజకీయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, ఎల్లప్పుడు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కల్లేడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్‌పై చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని స్వామి కోరారు.
ప్రసాద్ గౌడ్ నిర్వహించిన రెక్కీ పై, హత్య ప్రయత్నం పై చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన నేపాల్ వెళ్లి సుపారి గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని, తుపాకులు, కత్తులు సమకూర్చుకునే స్థాయికి వెళ్ళాడంటే అతని వెనక నుంచి ఎవరో ‘‘ఎమ్మెల్యేని హత్య చేయించడానికి సహకారం అందిస్తూన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇట్టి విషయమై పోలీస్ అధికారులు నిందితున్ని విచారించి కుట్ర వెనక ఉన్న వారందరినీ వెలికి తీయాలని, ఆయన వెనక ఉన్నది ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇటువంటి చర్యలతో జీవన్ రెడ్డి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. దమ్ము దైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి కానీ ఇటువంటి కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. హైద్రాబాద్‌లో గాని, ఆర్మూర్ నియోజకవర్గంలో గానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి కి కట్టుదిట్టమైన భద్రత పెంచి అదనపు భద్రత కల్పించాలని డి.ఐ.జి ఆఫ్ పోలీస్‌ని, రాష్ట్ర హోం శాఖ మంత్రిని కోరారు. విలేకరుల సమావేశంలో ‘‘తెలంగాణ మాదిగ మహాసేన’’ సంఘం నాయకులు పొన్నాల చంద్రశేఖర్, బొడ్డు గోపి, భాస్కర్, శ్రీనివాస్, పోన్నాల రాజన్న తదితర నాయకులు పాల్గొన్నారు.