నిజామాబాద్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు లబ్ధిదారులు శ్రమను జోడిస్తే ఆశించిన ప్రగతిని సాధించవచ్చని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హితవు పలికారు. దళితబంధు పథకం కింద ప్రభుత్వం అందించిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గడ్డం నర్సయ్య అనే లబ్ధిదారుడు ఆర్మూర్ పట్టణంలో కొత్తగా హోటల్ నెలకొల్పగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
అన్ని హంగులతో హోటల్‌ను ఆధునాతనంగా ఏర్పాటు చేయడం పట్ల లబ్ధిదారుడిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ తోడ్పాటును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నపుడే దళిత బంధు పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. స్థాపించుకున్న వ్యాపారాలను అంకితభావం, క్రమశిక్షణతో కష్టపడి నిర్వహిస్తూ, క్రమక్రమంగా విస్తరించుకోవాలని సూచించారు.
దళితబంధుతో లబ్దిదారులు తమ కాళ్లపై తాము నిలదొక్కుకుని, మరో నలుగురికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఉద్బోధించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, తహసీల్దార్ వేణు తదితరులు పాల్గొన్నారు.