ప్రణాళికతో చదివితే విజయం మీదే

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని, పట్టుదలతో ఇష్టపడి చదవాలని, అంకిత భావంతో చదువుతేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేశారు.

ఉద్యోగ సాధనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులు పాటించవలసిన మెలకువలను అర్థవంతంగా ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. తన స్వీయ అనుభవాలను జోడిరచి పలు అంశాలపై అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తద్యమవుతుందన్నారు.

అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం ఆపకూడదని ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమై కోరుకున్న ఉద్యోగం సాధించాలని నిరుద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. సిలబస్‌పై పట్టు కలిగి ఉండాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుంటూ, పరీక్ష విధానానికి అనుగుణంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. అనవసర సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల వాతావరణంలో ఏకాగ్రతతో సిద్ధం కావాలని కోరారు. పరీక్షల్లో ప్రతి ప్రశ్న కీలకమని, ప్రిపరేషన్లు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. ఉద్యోగ సాధనలో ఎదురయ్య అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు పోవాలని కోరారు.

గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కొలువు దక్కేలా కృషి చేయాలని సూచించారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డప్పుడు విజేతలు అవుతారని పేర్కొన్నారు. యువత దురాలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఏకాగ్రత, స్థిరత్వంతో విషయపరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.పోటీ పరీక్షల్లో భయం వీడితే విజయం సాధించడం సులభం అవుతుందని చెప్పారు. బట్టి విధానానికి స్వస్తి పలికాలన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేలా అన్ని సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపైనే దృష్టి సారించాలని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక నైపుణ్యం, శక్తి, సామర్థ్యం ఉంటుందని, తమ మీద తాము నమ్మకం ఉంచి కష్టపడ్డ వారే విజయం సాధిస్తారని తెలిపారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి వస్తున్న నోటిఫికేషన లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదో సువర్ణ అవకాశమని, ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం వచ్చిందని, ఇప్పటికే గ్రూప్‌ 1, ఆర్టీవో, ఎస్సై, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు.

త్వరలోనే గ్రూప్‌- 2,4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని వివరించారు. గ్రూప్‌ -1 కు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్స్‌ లో అడిగే ప్రశ్నలు, అందుకోసం అభ్యర్థులు ఎలా చదవాలో విశ్లేషణాత్మకంగా తెలిపారు. బట్టి పద్ధతికి స్వస్తి పలికాలన్నారు. సమగ్రంగా అధ్యయనం చేయాలని, చదివిన అంశాలను అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలన్నారు. అభ్యర్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పక్క ప్రణాళికతో సంసిద్ధులైతే ఉద్యోగం సాధించడం సులభం అవుతుందని చెప్పారు. ఏకాగ్రతతో చదివి యువతి, యువకులు తాము కోరుకున్న ఉద్యోగాన్ని దక్కించుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఎస్సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్‌ కూడా అందజేస్తున్నామన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్లు వెలవడినప్పుడు చూపిన ఉత్సవాన్ని పరీక్ష పూర్తి చేసే వరకు నిరంతరం కొనసాగించాలన్నారు. సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ లావణ్య మాట్లాడారు. సౌత్‌ క్యాంపస్‌ అభివృద్ధికి అప్పటి తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ పార్థసారథి చేసిన కృషిని కొనియాడారు. సౌత్‌ క్యాంపస్‌ లోపలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఏఎస్పీ అన్యోన్య, ఆర్టీవో వాణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కిష్టయ్య పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »