నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే ప్రతి మొక్కకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.ఎం.డోబ్రియల్ సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అయిన అరణ్య భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అటవీ శాఖ అధికారులు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఓలతో హరితహారం ప్రగతిపై సమీక్ష జరిపారు.
ఒక్కో జిల్లా వారీగా హరితహారం అమలు తీరును ఆరా తీయగా, నిజామాబాద్ జిల్లాలో సాధించిన ప్రగతి, చేపట్టాల్సి ఉన్న కార్యక్రమాల గురించి డీ ఎఫ్ ఓ సునీల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.ఎం.డోబ్రియల్ మాట్లాడుతూ, అనేక జిల్లాలలో నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయడం లేదన్నారు. ప్రతి జిల్లాలో జియో ట్యాగింగ్ 90 శాతానికి తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
ఇప్పటికే యాభై శాతానికి పైగా మొక్కల పంపిణీ పూర్తయినందున వాటిని నిర్దేశిత ప్రదేశాల్లో నాటారా, లేదా అన్నది పరిశీలన జరిపి నివేదిక అందించాలని అన్నారు. నాణ్యతతో కూడిన, ఎక్కువ ఎత్తు కలిగిన మొక్కలను నాటాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో పచ్చదనం పెంపొందుతుందని, హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని హితవు పలికారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హరితహారంలో వెనుకబడి ఉన్న జిల్లాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్‌డీఓ చందర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.