నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్ భర్త అప్పులతో అభివృద్ధి చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వంత మండలం వేల్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల వడ్డెర కాలనీ సర్పంచ్ బలవన్మరణం పొందాడు. గ్రామ సర్పంచ్ ముత్తమ్మ భర్త మల్లేష్ తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు సేవించాడు. ఆర్మూర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏకంగా సర్పంచ్ భర్త మల్లేష్ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పు తీసుకొచ్చి పనులు చేయించారు. తీరా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఈ దారుణానికి ఒడి కట్టాడని స్థానికులు వాపోయారు. అభివృద్ధి పనుల కోసం 20 లక్షల వరకు అప్పు చేయడం జరిగిందని స్థానికులు వెల్లడిరచారు.
అప్పులకు వడ్డీ కడుతూనే ఉన్నారని, అప్పిచ్చినవారు ఇవ్వాలని అడగడంతో ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కాక అప్పుదారులకు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం రేగింది. గత కొంతకాలంగా జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు కూడా తమ గ్రామానికి బిల్లులు రావడం లేదని వాపోతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించారు. ఏదేమైనా జిల్లాలో బిల్లులు రాకపోవడంతో సర్పంచులు మానసిక ఆందోళన గురవుతున్నారు.
సర్పంచ్‌కు ఎటువంటి బిల్లులు చెల్లింపులు లేవు – డిపిఓ :
పడిగెల వడ్డెర కాలాని సర్పంచ్ ముత్తమ్మకు ఎటువంటి బిల్లులు చెల్లింపులు లేవని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుండి జూలై 2022 వరకు రూ. 21 లక్షల 43 వేల 807 గ్రామపంచాయతీ ఖాతాలో జమ అయ్యాయని, జీతాలు ఇతర చెల్లింపులు నిర్వహణ తదితర పనుల కోసం క్రిమిటోరియం కొరకు రూ. 21 లక్షల 40 వేల 7 చెల్లించినట్టు తెలిపారు. మొత్తానికి సర్పంచ్ ముత్తమ్మకు ఎలాంటి చెల్లింపులు లేవని డిపివో స్పష్టం చేశారు.