కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు.
గురువారం భారతస్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ నుండి అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్నాహక ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు.
పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చోరవ తీసుకోవాలని అన్నారు.
వజ్రోత్సవాల షెడ్యూల్
ఆగస్టు 8 : ప్రారంభ సమారోహం
ఆగస్టు 9 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం
ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు.
ఆగస్టు 11 : ఫ్రీడం రన్ నిర్వహణ.
ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి.
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు..
ఆగస్టు 14 : సాయంత్రం.. సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు.
ఆగస్టు 15 : స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ.
ఆగస్టు 16 : ఏకకాలంలో, ఎక్కడివారక్కడ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18 : ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ.
ఆగస్టు 19 : దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20 : దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు