వజ్రోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు.

తొలి రోజున ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉత్సవాలు ప్రారంభిస్తారని, 9 న జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశానికి మండల స్థాయి ముఖ్య అధికారులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. 10 వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి ఒకే చోట కనీసం 750 చొప్పున ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని ఫ్రీడమ్‌ పార్క్‌గా సంబోధించడం జరుగుతుందన్నారు.

11 న మున్సిపల్‌, మండల స్థాయిలో ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించాలని, 12 న జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌, 13 న ఎన్‌ సి సి, ఎన్‌ ఎస్‌ ఎస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఉద్యోగులతో ర్యాలీలు నిర్వహించి మైదానాల్లో త్రివర్ణ బెలూన్లను ఎగురవేయాలన్నారు. 14 న జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శనలు, బాణాసంచా కాల్చడం, 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16 న అన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయంలో సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17 న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18 ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్‌ కప్‌ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, 19 న అనాధ, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20 న స్వయం సహాయక సంఘాలు, మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 22 న హైదరాబాద్‌ లోని ఎల్‌ బీ స్టేడియంలో ముగింపు సంబరాలు ఉంటాయని కలెక్టర్‌ వెల్లడిరచారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని స్థాయిలలో అధికారులు ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను అనుసరిస్తూ వాటి నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 15 వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ఇంటింటికి జెండాలు పంపిణీ చేయాలని, అదే సమయంలో మువ్వన్నెల జెండా గౌరవానికి ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా ఫ్లాగ్‌ కోడ్‌ పక్కాగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు.

సబ్‌ స్టేషన్లు, రైతు వేదికల వద్ద పచ్చదనం పెంపొందించాలి

కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, రైతు వేదికల వద్ద పచ్చదనం పెంపొందించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి మీటరుకు ఒక మొక్క చొప్పున అందమైన పూల మొక్కలను నాటి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. మొక్కలు నాటిన ప్రదేశం చుట్టూ దాతల సహకారంతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయించాలని, ఈ పనులన్నీ వచ్చే శుక్రవారం నాటికి పూర్తి కావాలని గడువు విధించారు.

మొక్కలు నాటడంలో అలసత్వానికి తావిస్తే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అవెన్యూ ప్లాంటేషన్‌, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, మినీ ప్రకృతి వనాలు, ఇరిగేషన్‌ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిర్దేశిత ప్రదేశాలలో కాకుండా వేరే చోట్ల మొక్కలు నాటితే సంబంధిత అధికారుల నుండి నిధులు రికవరీ చేస్తామని కలెక్టర్‌ తేల్చి చెప్పారు.

వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మరో రెండు మాసాల పాటు అప్రమత్తతో కూడిన ముందస్తు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. అన్ని నివాస ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగు నీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఆర్‌డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, ట్రాన్స్కో ఎస్‌ఈ రవీందర్‌, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »