నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ నవీపేట్ మండలం కమలాపూర్ గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ గిరిజా తిరందాస్ మాట్లాడుతూ గృహహింస నిరోధక చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని, అత్తవారింట్లో జరిగే మానసిక వేధింపుల నుండి రక్షణ పొందొచ్చని, మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆగస్టు 13వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఇరు పక్షాలకు రాజీ కుదుర్చుకోవడం ద్వారా క్రిమినల్ కేసులు పరిష్కారమవుతాయని, అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సీనియర్ న్యాయ వాదులు రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహం అరికట్టాలని వివాహ వయసు రాకముందే మైనర్లకు వివాహాలు చేయొద్దని అలా చేయడం చట్టరీత్యా నేరమని, వివాహ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా సమాజం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.
పానల్ న్యాయవాది జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరికీ సమాన న్యాయ అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశంతో న్యాయ అధికార సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారని, ప్రజలకు ఉచిత న్యాయం అందిస్తున్నారని ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో న్యాయవాది పిల్లి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ సూరమ్మ, ఉప సర్పంచ్ రమేష్, నవీపేట్ ఎస్సై రాజారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.