డిచ్‌పల్లి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శనివారం ఉదయం డా. కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ జాతిపిత డా. కొత్తపల్లి జయశంకర్ సార్ మహోన్నతుడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిరళ ఉద్యమ పంథా నడిపిన గొప్ప నాయకుడని అన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా బోధనలోను, పరిశోధనలోను అద్భుతమైన ప్రావీణ్యాన్ని చూపేవారని అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కారణమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలు చేసి వాస్తవ పరిస్థితులను కళ్లముందు ఉంచారని అన్నారు.
తెలంగాణ మీద నిబద్ధత, అకుంఠిత దీక్ష కలవారని అన్నారు. సహజవనరులను సద్వినియోగ పరుచుకోవడం, చెరువులను బాగు చేయించుకోవడం, గ్రామ పునర్వ్యవస్థీకర కోసం వృత్తుల పునరుద్ధరణ చేయడం వంటి వాటిపై అవగాహన కల్పించారని అన్నారు. నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు.
20 ఏండ్ల వయస్సులోనే ఫజల్ అలీ కమీషన్‌కు నివేదిక సమర్పించిన గొప్ప రాజనీతిజ్ఞుడని అన్నారు. నీళ్లకోసం, నిధులకోసం, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించబడాలని ఆయన ఆశించారని అన్నారు. జయశంకర్ సార్ భావజాలం, ఆలోచనా విధాన ఎప్పటికి తెలంగాణ ప్రజలకు ఆదర్శప్రాయమని అన్నారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ, డీన్ ఆచార్య పి.కనకయ్య, బిసి సెల్ డైరెక్టర్ డా. సాయిలు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. బాలశ్రీనివాస మూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా. అబ్దుల్ ఖవి, డా. జమీల్ అహ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ డా. జ్యోత్స్న, సూపరింటెండెంట్ భాస్కర్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.