నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 88 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ కూడలి వద్ద గల జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణాకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని అన్నారు.
తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని కలెక్టర్ ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అణిచివేతకు గురవుతుండడం, అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతుండడాన్ని చూసి ప్రత్యేక పాలన కోసం ప్రజలను చైతన్య పరుస్తూ అహరహం శ్రమించారని గుర్తు చేశారు. ఆయన ఆశయం అయిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ, అంతకు ముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు.
ఆ మహనీయుడి ఆశయాల మేరకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలీస్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనే ఉఛ్వ్వాస నిశ్వాసగా జీవితం వెళ్లదీశారని కొనియాడారు. ఆయన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాకు ఆచార్య జయశంకర్ పేరు పెట్టడంతో ఆయనను స్మరించుకునేందుకు వీలు కలిగిందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సేవలను గుర్తుచేసుకునేందుకు వీలుగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యముశంగా ప్రవేశపెడితే బాగుంటుందని సీపీ నాగరాజు అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ప్రజా సంఘాల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ, ఆయన జయంతిని పురస్కరించుకుని బీ.సిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, ఆయా సంఘాల ప్రతినిధులు హన్మాండ్లు, నరాల సుధాకర్, అలుక కిషన్, చెన్నయ్య, రాజేశ్వర్, గంగకిషన్ తదితరులు పాల్గొన్నారు.