నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్లందరూ ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. శాస్త్రుల దత్తాద్రిరావు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటం లేదనీ, సకాలంలో పెన్షన్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నెల పెన్షన్ ఇంకా రాలేదని వాపోయారు.
పే రివిజన్ కమిటీ చేసిన సిఫార్సులు కూడా అమలుకు నోచుకోలేదని, రూ.398 స్పెషల్ టీచర్ల విషయంలో, నగదు రహిత వైద్యం విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలా మారాయని అన్నారు. నగదు రహిత వైద్యం కార్పోరేట్ ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆస్పత్రిలో అనుమతించడం లేదని, మెడికల్ బిల్లుల రియంబర్స్‌మెంట్ కొరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందన్నారు.
వెల్నెస్ సెంటర్ నందు డాక్టర్లు, మందులు లేక వెలవెల పోతున్నాయని, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని వారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి
కే. రామ్మోహన్రావు, జిల్లా నాయకులు ముత్తారం నరసింహస్వామి, ప్రసాద్, హనుమాన్లు, ఈ. వి. ఎల్ నారాయణ, శిర్ప లింగయ్య, సాయిలు, ప్రసాద్, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, పుండరీ తదితరులు పాల్గొన్నారు.