కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ (35) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం బాన్సువాడ రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి మహిళా ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నాటి పరిస్థితుల్లో కామారెడ్డి జిల్లాలో రక్తం దొరకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని దాని దృష్టిలో పెట్టుకొని సమూహం ఏర్పాటు చేయడం జరిగిందని, సమూహం నేటి సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచిందని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా సమూహాలు రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ముందుగా కుటుంబ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ వేదప్రకాష్‌ను సన్మానించారు. రక్తదానానికి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ జమీల్ హైమద్, శివ కృష్ణ, గౌతమ్, అంజి, నాగ సాయి, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు రవి పాల్గొన్నారు.