కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రిచర్డ్ అటెన్ తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. కామారెడ్డి పట్టణంలోని 4 థియేటర్లలో మంగళవారం ఉచిత సినిమా ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులను బస్సులలో థియేటర్ల వద్దకు తీసుకువచ్చి సినిమాను చూపించారు.
ప్రియా ఏషియన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి, సినిమా చూడడానికి వచ్చిన విద్యార్థుల వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 10 థియేటర్లలో మహాత్మ గాంధీ మీద రూపొందించిన గాంధీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట పదిహేను నిమిషాల వరకు చిత్రాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఇన్చార్జ్ ఆర్టీవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, మండల విద్యాధికారి ఎల్లయ్య పాల్గొన్నారు.