కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 17న జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు.
మండల కేంద్రాల్లో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో జూనియర్, సీనియర్ రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొనాలని పేర్కొన్నారు.
సెప్టెంబర్ ఐదున పిట్లంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి అన్నారు. జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేపట్టాలని కోరారు. సమావేశంలో జిల్లా చైర్మన్ రాజన్న, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, కోశాధికారి దస్థిరాం, ప్రతినిధులు డాక్టర్ విక్రమ్, నరసింహ పాల్గొన్నారు.