నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించేందుకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేస్తూ స్ఫూర్తి నింపేందుకు వీలుగా ఆయా థియేటర్లలో బుధవారం దేశభక్తి చిత్రమైన ‘గాంధీ’ మూవీని ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉషా మల్టిప్లెక్స్‌ను సందర్శించారు. గాంధీ సినిమాను తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మల్టీప్లెక్స్‌లోని మొత్తం మూడు స్క్రీన్‌ల వద్ద సదుపాయాలను నిశితంగా పరిశీలన జరిపిన కలెక్టర్ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. సినిమా చూయించేందుకు విద్యార్థులను థియేటర్‌లకు తీసుకువచ్చి, మూవీ పూర్తయిన తరువాత మళ్ళీ తీసుకువెళ్లే సమయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల భద్రతకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
విద్యార్థుల వెంట ఒక్కో వాహనంలో కనీసం ఇద్దరు అటెండెంట్లు ఉండాలని అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులందరికీ థియేటర్లలో సీట్ల సామర్ధ్యానికి అనుగుణంగా వరుస క్రమంలో గాంధీ మూవీ చూపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బుధవారం జిల్లాలోని మొత్తం 14 థియేటర్లలో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువగా 7454 మంది విద్యార్థిని, విద్యార్థులు గాంధీ సినిమా ప్రదర్శనను తిలకించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.