నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, మండల కేంద్రాల్లో జాతీయ స్ఫూర్తిని చాటేలా ఫ్రీడం రన్ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఫ్రీడం రన్ ఏర్పాట్ల విషయమై బుధవారం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్‌లో ఆయా శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 11న గురువారం ఉదయం ఆరు గంటలకు జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగే ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దేశ సమైక్యతను చాటిచెప్పేలా పండుగ వాతావరణంలో నిర్వహించనున్న ఫ్రీడం ర్యాలీలో అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ర్యాలీ ముగిసిన అనంతరం కలెక్టరేట్ మైదానంలో యోగా, వుషూ ప్రదర్శనలు ఉంటాయని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.