కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేశారు. పార్కులో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కాలనీవాసులు పార్కులో నాటిన మొక్కలను ప్రతి కుటుంబం రెండు చొప్పున దత్తత తీసుకొని సంరక్షించాలని సూచించారు. స్వతంత్ర సమరయోధులు పేరిట పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పార్కులో చిన్న పిల్లల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలను నాటి సంరక్షిస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్రీడం పార్కులో 75 నెంబర్ ముగ్గు వేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఎఫ్‌ఓ నిఖిత, వార్డు కౌన్సిలర్ వనిత, కాలనీ ప్రతినిధులు రామ్మోహన్, మోహన్ రావు పాల్గొన్నారు.