నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – 2022 సంబురాలలో భాగంగా ఈ నెల (ఆగస్ట్) 16 వ తేదీన సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా కవులందరి సమక్షంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందింపజేసే విధంగా, దేశభక్తిని స్ఫురింపజేసే విధంగా, త్యాగధనుల స్ఫూర్తిని కొనియాడే విధంగా, విశిష్ట ప్రదేశాల వైభవాన్ని కీర్తించే విధంగా 20 – 25 పంక్తుల (లైన్ల) వరకు మాత్రమే కవులు తమతమ కవితలను రచించాలని అన్నారు.
దేశ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యతిరేక, వ్యంగ్యాత్మక భావన రానీయకుండా కవితల రచన ఉండాలని అన్నారు. తమ కవితలను ఈ నెల 13 వ తేదీ వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి ఫోన్ నంబర్ 9951444803 కు వాట్స్ఆప్ చేయాలని ఆయన సూచించారు. చేరిన కవితలన్నింటిని పరిశీలించిన తర్వాతనే తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
వస్తు పరంగా, శిల్ప పరంగా మేలైనవి రచించిన కవులకు మాత్రమే కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం లభిస్తుందని అన్నారు. తప్పని సరిగా ముందుగానే కవితలు పంపాలని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉండదని అన్నారు. కావున నిజామాబాద్ జిల్లా కవులు మాత్రమే తమ కవితలు పంపి, కవి సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కోరారు.