ఎడపల్లి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి మండలం జానకంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రం (సి.టి.సి.)లో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా, పోలీస్ కమిషనర్ నాగరాజు, ఇతర అధికారులు, ఎన్‌సిసి క్యాడెట్లు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీడం పార్కుగా నామకరణం చేసిన ప్రదేశంలో 750 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత గురించి జిల్లా జడ్జి నొక్కి చెప్పారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించడం పర్యావరణానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా, వాటి సంరక్షణకు కృషి చేయాలని హితవు పలికారు. స్వాతంత్య్ర వేడుకల స్పూర్తితో ప్రతి ఒక్కరు తమ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
హక్కుల కోసం పోరాడాలని, అదే సమయంలో తమ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఉద్బోధించారు. సమాజానికి చేటు చేకూర్చే అసాంఘిక కార్యకలాపాల గురించి తెలిస్తే పోలీసుల దృష్టికి తేవాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారని అన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి పై సంబరాలు జరుపుకుంటూనే, ఇకముందు దేశ ప్రగతి కోసం ఏ దిశగా పయనించాలనే కోణంలో ఆలోచనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వజ్రోత్సవ వేడుకల స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ 22 వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఫ్రీడమ్ రన్, ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలు, సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. స్వతంత్ర భారత ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిచెప్పే విధంగా పంద్రాగస్టు రోజున ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లపై ఫ్లాగ్ కోడ్ పాటిస్తూ త్రివర్ణ పతాకాన్నితప్పనిసరిగా ఎగురవేయాలని సూచించారు. ఇది నా దేశం… ఈ దేశ అభ్యున్నతికి నా వంతు కృషి చేస్తాను అనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీలు అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్, ఏసీపీలు వెంకటేశ్వర్, రామారావు, శ్రవణ్ కుమార్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, జెడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్, నిజామాబాదు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, పోలీస్ అధికారులు, ఎన్‌సిసి క్యాడెట్లు, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.