నిజామాబాద్, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగి ఉన్న వారికి కూడా ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను పొందడానికి ఇప్పటివరకు కేవలం ఆరోగ్యశ్రీ, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలను పొందే అవకాశం ఉండేదన్నారు.
ఈ రెండు కార్డులు లేని వారు ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలను పొందేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. దీనిని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఇటువంటి సమస్యలేమీ తలెత్తకుండా ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రతా కార్డు ద్వారా కూడా ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్యశ్రీ సేవలను పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందని కో ఆర్డినేటర్ డాక్టర్ వినీత్ రెడ్డి తెలిపారు.