కామారెడ్డి, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పార్శి రాములు కళ్యాణమండపంలో సైబర్ కాంగ్రెస్ గార్డ్ ఫీనాలే పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీకు లాటరీ పలిగిందని, గిఫ్ట్ వచ్చిందని, తక్కువ ధరకు ఖరీదైన సెల్ఫోన్ విక్రయిస్తామని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి నమ్మించి, సర్వీస్ ఛార్జ్ పేరిట రూ.2000 ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించాలని చెప్తారు. మనం డబ్బులు పంపిన కాసేపటికి ఫోన్ చేయగా బ్లాక్ లిస్టులో పెడతారు. ఫోన్ కలవదు. మోసపోయామని గ్రహించి వ్యక్తులు వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్గా ఎంపిక చేసి అవగాహన కల్పించారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితేనే విజయం సిద్ధిస్తుందని సూచించారు. పాఠ్యప్రణాళిక పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్యపరచడమే ప్రధాన లక్ష్యమన్నారు.
సెల్ ఫోన్లు, అంతర్జాలం, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాల వేధింపులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని పేర్కొన్నారు.
సైబర్ నేరాలు జరుగుతున్న విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఉత్తమ అంబసిడర్లుగా వంశీ (జడ్పీహెచ్‌ఎస్ భిక్కనూర్), ప్రజ్ఞ (జడ్.పి.హెచ్.ఎస్ నెమలి), రాజేశ్వరి (జెడ్పిహెచ్‌ఎస్ కృష్ణాజివాడి) ఎంపికైనట్లు డిఇఓ రాజు తెలిపారు. ఎంపికైన వీరికి ప్రశంస పత్రాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఉమారాణి, ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, ఎన్నారై ఇంద్రసేనారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.