నందిపేట్, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు.
జామ మస్జిద్ నుండి ప్రారంభమైన ర్యాలీలో జామ మస్జిద్, ఇబ్రహీం మజీద్, రహమామియా మజీద్, మస్జిద్ మోజ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జామా మసీదు నుండి జిల్లా పరిషత్ హైస్కూల్, బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఐలమ్మ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జనగణ గేయం పాడి ర్యాలీ విరమించారు. ఈ సందర్బంగా తాసిల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతు 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ అంతట జరుగుతున్న వేడుకలలో భాగంగా శుక్రవారం నందిపేట్ మండల ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించడం మండల ప్రజలకు గర్వకారణమని ప్రశంసించారు.
ఎస్సై ఆరిపోద్దిన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముస్లిం ప్రజలు కూడా తమవంతు సహకారం అందించి దేశ ప్రతిష్టను పెంపొందిస్తున్నారని కొనియాడారు. 75 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలలో అవగాహన కల్పించడానికి తిరంగా ర్యాలీ నిర్వహించామని మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు కలిమ్ అహ్మద్ పేర్కొన్నారు.
కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే దేశభక్తిని పెంపొందించాలని కోరారు. దేశం కోసం స్వతంత్ర పోరాటంలో ముస్లింలు పాల్గొని ప్రాణాలు అర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా దేశం కొరకు అవసరమైతే తమ ప్రాణాలు అర్పించడానికి ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు.
సర్పంచ్ ఎస్.జి వాణి తిరుపతి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తూ ప్రపంచ దేశాలకు భారతదేశ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, మండల ముస్లిం కమిటీ ఫౌండర్ షేక్ గౌస్, రఫీ, మండల టిఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పాషా మస్జిద్ కమిటీ అధ్యక్షులు గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, నందిపేట్ గ్రామ ముస్లింలు పాల్గొన్నారు.