నిజామాబాద్, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. సహోదర భావాన్ని చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకను వజ్రోత్సవ సంబరాలతో మిళితం చేయడం రక్షాబంధన్ పండుగకు మరింత ప్రాధాన్యత చేకూరింది.
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూ రక్షాబంధన్ వేడుకను జరుపుకున్న ప్రజలు, వజ్రోత్సవాలను పురస్కరించుకొని జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ఈసారి త్రివర్ణ పతాకానికి ప్రతీకగా మూడు రంగులతో కూడిన రాఖీలు విరివిగా వాడారు. అక్కా చెల్లెలు తమ అన్నదమ్ముల ముంజేతులకు రాఖీలు ధరింప చేయగా, వారికి ఎల్లవేళలా రక్షగా ఉంటామని సోదరులు ఈ పండుగ సాక్షిగా భరోసా అందించారు.
రక్షాబంధన్ వేడుక నేపద్యంలో పలువురు కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఆర్‌బివిఆర్‌ఆర్ సొసైటీ ప్రతినిధులు అమృతా రెడ్డి, నరేందర్ రెడ్డి, అమర్ జీత్ రెడ్డి, సుజిత్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.