ఉప్పొంగిన ఉత్సాహం …. వెల్లివిరిసిన చైతన్యం

నిజామాబాద్‌, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూపార్క్‌ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్‌, రాష్ట్రపతి రోడ్‌, బస్టాండు మీదుగా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలకు సంకేతంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 750 మీటర్ల పొడవు కలిగిన జాతీయ జెండాను ప్రదర్శించడం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశేష సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి హాజరైన అన్ని వర్గాల వారు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఉప్పొంగిన ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు.

చిన్నారులు మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ జాతీయతా భావాన్ని చాటుతూ ర్యాలీలో భాగస్వాములై వజ్రోత్సవ సంబరాలకు వన్నెలద్దారు. ఎటు చూసినా నగరంలో పండుగ వాతావరణంతో కూడిన సందడి కనిపించింది. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఫ్లాగ్‌ కోడ్‌ పరిపూర్ణంగా అమలయ్యేలా అధికారులు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఫ్రీడం ర్యాలీని ప్రారంభించి అందరితో కలిసి ఆసాంతం ప్రదర్శనలో పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, శాసన మండలి సభ్యుడు రాజేశ్వర్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, నగర మేయర్‌ దండు నీతు కిరణ్‌, అదనపు కలెక్టర్‌ లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు గడీల రాములు తదితరులంతా ర్యాలీలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లు, ఏడవ పోలీసు బెటాలియన్‌ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్‌ స్టూడెంట్లు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు 750 అడుగుల పొడవు కలిగిన భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని దేశభక్తి నినాదాలు, నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీకి హాజరైన వారితో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఎటుచూసినా రెపరేపలాడుతున్న మువ్వన్నెల జెండాలు సగర్వంగా ఎగురుతూ కనువిందు చేశాయి. ప్రజలు వ్యాపార సముదాయాలు, నివాస గృహాల భవనాల పైకి చేరుకుని 750 మీటర్ల జాతీయ జెండాతో కూడిన ఫ్రీడం ర్యాలీని వీక్షించారు. కలెక్టరేట్‌ మైదానంలో మూడు రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. సాంస్కృతిక కళాకారులు దేశభక్తి గేయాలు ఆలపించారు. ఫ్రీడం ర్యాలీని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్‌ వలస పాలకుల చేతిలో బందీ అయిన భారతదేశానికి స్వేచ్చా స్వాతంత్య్రాలు కల్పించేందుకు అనేకమంది సమర యోధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేస్తూ, వారందరికీ ప్రభుత్వం తరపున, జిల్లా ప్రజలందరి పక్షాన నివాళులు అర్పిస్తున్నామన్నారు.

వారి త్యాగాలు, జాతీయ స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేస్తూ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రత్యేకించి నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ దేశ స్వాతంత్య్ర ఔన్నత్యాన్ని చాటిందని కొనియాడారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తున్న జిల్లా యంత్రాంగం, పోలీస్‌ అధికారులను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగిస్తూ, 22వ తేదీ వరకు జరిగే వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా అన్ని వర్గాల వారు వేడుకల్లో భాగస్వాములు కావాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారని అన్నారు. నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తికి ఇది అడ్డం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతి భారతీయుడికి పండగ లాంటివని పేర్కొన్నారు. ఈ దేశం మనది..ఈ దేశం కోసం మేమంతా ఏకమవుతాం అని ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా చాటిచెప్పారని పౌరుల స్ఫూర్తిని కలెక్టర్‌ కొనియాడారు. త్యాగధనుల పోరాటాలతో మనమంతా స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

ఈ నెల 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం సగౌరవంగా ఎగురవేయాలని, 16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడ అన్ని కార్యాలయాలు, కూడళ్ల వద్ద సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని సూచించారు. అతిథులు ప్రసంగించిన మీదట జాతీయ గీతాలాపనతో ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ అరవింద్‌ బాబు, నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల బాధ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »