దేశంలో ఎక్కడా లేనివిధంగా వజ్రోత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసిఆర్‌ నిర్వహిస్తున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.

ర్యాలీ ప్రధాన రోడ్డు మీదుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం తొమ్మిది గంటల సమయానికే వందలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ, యువకులు మొదలు వృద్ధుల వరకు కదం కదం కలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దం పట్టింది. బెలూన్లను ప్రజా ప్రతినిధులు, అధికారులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. భావితరాలకు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తెలియజేయడం… వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడం వేడుకల ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. జాతీయ భావం, దేశభక్తిని పెంపొందించాలని కోరారు. ఈ నెల 15న విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేసి జెండాల ద్వారా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రి కార్డ్‌ మన రాష్ట్రం సృష్టిస్తుందని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాఫలమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి రోజూ 4,500 మందికి గాంధి సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల పురస్కరించుకుని 15 రోజుల పాటు ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో,మండల కేంద్రలల్లో, గ్రామలల్లో సామూహికంగా జాతీయ గీతాలాపన నిర్వహిస్తామన్నారు. ఈనెల 16 వ తేదీ మంగళవారం రోజున ఉదయం 11:30 కి నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.జాతీయ గీతాలాపన చేసే సమయంలో వాహనాల రాకపోకలు లేకుండా అన్ని జంక్షన్‌ లలో ట్రాఫిక్‌ ని నిలిపివేయడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్పర్సన్‌ హిందూ ప్రియ, జిల్లా తెరాస అధ్యక్షుడు ముజి బోద్దిన్‌, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్‌సిసి, స్కౌట్స్‌, గైడ్స్‌, మహిళలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »