నిజామాబాద్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో కలేక్టరేట్ ప్రగతి భవన్‌లో ఈ నెల 16 తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహింపబడుతున్న కవి సమ్మేళనానికి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. నిర్వహణ కమిటీలో డా. వంగరి త్రివేణి, ఘనపురం దేవేందర్, డా. కాసర్ల నరేశ్ రావు, డా. శారదా హన్మాండ్లు, నరాల సుధాకర్, గుత్ప ప్రసాద్, డా. మద్దుకూరి సాయిబాబు ఉన్నారు. దీనికి సంబంధించిన సమీక్షా సమావేశం శనివారం ఉదయం అదనపు కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి’’ అనే అంశంపై నిజామాబాద్ కవులు కవితలు రచించి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన కోరారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందింపజేసే విధంగా, దేశభక్తిని స్ఫురింపజేసే విధంగా, త్యాగధనుల స్ఫూర్తిని కొనియాడే విధంగా, విశిష్ట ప్రదేశాల వైభవాన్ని కీర్తించే విధంగా 20 – 25 పంక్తుల (లైన్ ల) వరకు మాత్రమే కవులు తమతమ కవితలను రచించాలని అన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యతిరేక, వ్యంగ్యాత్మక భావన రానీయకుండా ప్రత్యక్ష, పరోక్ష దూషణలు లేకుండా పదజాలంతో ఎవరినీ కించపరిచకుండా కవితల రచన సాగాలని అన్నారు.
తమ కవితలను ఈ నెల 14 వ తేదీ వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ డా. వంగరి త్రివేణి ఫోన్ నంబర్ 9951444803 కు వాట్స్ ఆప్ చేయాలని ఆయన సూచించారు. చేరిన కవితలన్నింటిని పరిశీలించిన తర్వాతనే తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
వస్తు పరంగా, శిల్ప పరంగా మేలైనవి రచించిన కవులకు మాత్రమే కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం లభిస్తుందని అన్నారు. తప్పని సరిగా ముందుగానే కవితలు పంపాలని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉండదని అన్నారు. కవి సమ్మేళనంలో తమ కవితల ప్రతిని అందజేయాలన్నారు. వాటిని హైదరాబాద్‌లోని తెలంగాణ సాహిత్య అకాడమీకి పంపబడుతాయని, వారు కవితలన్నింటిని సంకలనంగా ప్రచురిస్తారని పేర్కొన్నారు.