కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి జానపద కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఆదివారం డివిజన్ స్థాయి జానపద కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తితో గ్రామీణ కళాకారులు ప్రదర్శనలు చేయడం అభినందనీయమని కొనియాడారు.
అంతరించిపోతున్న గ్రామీణ కళలను వెలుగులోకి తేవడానికి జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. పురాతన నాటకాలు, పాటల ద్వారా మధురమైన జ్ఞాపకాలు దాగి ఉంటాయని తెలిపారు. గతంలో ఎన్టీ రామారావు కృష్ణుడు, రాముడు అవతారంలో సినిమాల్లో కనిపించేవారని గుర్తు చేశారు.
ప్రాచీన కళలు గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీధి బాగోతాలు, నాటికలు, డప్పు వాయిద్యాల విన్యాసం, దేశభక్తి గీతాలు, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కథ, యక్షగానం, కోలాట వంటి ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారులకు నగదు బహుమతులు అందజేసి శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ ప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజయ్య, సమన్వయకర్త మనోహర్ రావు, సివిల్ సప్లై డిఎం జితేంద్రప్రసాద్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.