నిజామాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 75 వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్దీవో రవి, ఏసీపీ గిరిరాజు తదితరులతో కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న పంద్రాగస్టు వేడుక కావడంతో ఏర్పాట్ల విషయమై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.