కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషి వల్ల జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా అభివృద్ధికి దిశ నిర్దేశం చేశారు. అటవీశాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, దళిత బంధు శకటాలను స్పీకర్ తిలకించారు. దళిత బందును పథకం వల్ల దళిత కుటుంబాలకు జరిగిన ప్రయోజనాన్ని ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
ఐసిడిఎస్, బిందు సేద్యం, ఆయిల్ ఫామ్ సాగు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, సరుకు, సబ్బులు, పిండి వంటల తయారీ స్టాళ్లను స్పీకర్ పరిశీలించారు. అంతకుముందు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ భావం, దేశభక్తి పెంపొందించాలని కోరుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అంగన్వాడి కేంద్రాలకు చెందిన చిన్నారులు గాంధీ, నెహ్రు, భగత్ సింగ్, భరతమాత, సైనికులు, డాక్టర్ల వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేష్ దోత్రే, చంద్రమోహన్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.