డిచ్‌పల్లి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదురుగా 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దినోత్సవాలలో భాగంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్‌తో కలిసి మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలను అర్పించి గౌరవ వందనం చేశారు.
తదనంతరం తమ తమ విధుల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న వారికి శాలువా, 5 వేల రూపాయల నగదు పురస్కారాలతో సన్మానించారు. అధ్యాపకులు ఆచార్య సిహెచ్. ఆరతి, డా. కె.లావణ్య, డా. అబ్దుల్ ఖవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు విజయలక్ష్మి, సాయాగౌడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా. ఎం. రాజేశ్వరి, వి. శ్రీనివాస్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పుణ్యవర్ధన్, ఉదయ్ కుమార్, గంగారాం పురస్కారాలు పొందారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… ఎందరో త్యాగధనుల ఆత్మ త్యాగ ఫలంగా సిద్ధించిన భారత దేశంలో నేడు మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా యూనివర్సిటీ అకడమిక్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా సాధిస్తున్న ప్రగతిని వివరించారు. తెలంగాణ యూనివర్సిటిలో ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ నెట్ వెర్క్, అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, ఎలెక్ట్రానిక్, బీ పార్మసీ, ఎమెస్సీ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇది వరకు టీయూలో నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ స్థాయి సదస్సులను గూర్చి, ప్రాజెక్టులను గూర్చి, పరిశోధనలను గూర్చి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి సంబంధించిన నూతన పాఠ్య ప్రణాళికలను వినిర్మాణం చేస్తున్న విషయాన్ని తెలిపారు.
తర్వాత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాళొని పరిపాలనా భవనం నుంచి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వరకు స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. జాతీయ సమైక్యతకు చిహ్నంగా, దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా, త్యాగధనుల కీర్తిని స్మరించే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.