నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈనెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే గల్ఫ్ వలసల అంతర్జాతీయ సమావేశానికి గల్ఫ్ జెఏసి నాయకుడు సంగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వానం అందింది. గల్ఫ్ ఉద్యోగాల భర్తీ, నియామక ప్రక్రియలో అనుసరించాల్సిన పారదర్శకమైన, న్యాయమైన, నిష్పాక్షికమైన, నైతికమైన పద్ధతుల గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల గురించి సదస్సులో చర్చ జరుగుతుంది.
ఫెయిర్ అండ్ ఎథికల్ రిక్రూట్‌మెంట్, స్ట్రాటజిక్ రిపోర్టింగ్ అనే ఈ వర్క్‌షాప్‌లో గల్ఫ్ వలస కార్మిక నాయకులకు సామర్థ్యపెంపు (కెపాసిటీ బిల్డింగ్) శిక్షణ ఇస్తారు. ఫిలిఫ్ఫీన్స్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే సంస్థ, థాయిలాండ్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (హెచ్‌ఆర్డిఎఫ్) అనే సంస్థ సంయుక్తంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) కార్యక్రమానికి సహకరిస్తున్నది.
ఈ సందర్భంగా సంగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ఆసియా దేశాలకు చెందిన వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం, పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం థాయిలాండ్‌లో జరిగే వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమానికి తనకు అవకాశం కల్పించిన ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డికి కృత్ఞతలు తెలిపారు.