నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర మేయర్ అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి వేముల, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఒక మోస్తరుగా ఏకబిగిన కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇందల్వాయి, కమ్మర్పల్లి, మోర్తాడ్ కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు, ధర్మారం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి మరింతగా పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.
నిజానికి వర్షం కురుస్తుండడం, మైదానం తడిసిపోయి ఉండడంతో చిన్నారులు జారిపడే ప్రమాదం ఉందని భావించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విద్యార్థినులను వారించినప్పటికీ వినకుండా పట్టుదలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి దేశం పట్ల తమ ప్రేమాభిమానాలు, అనురక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల్లో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.