నిజామాబాద్, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం.
కార్యక్రమాలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 95 మంది కవులు తమ సందర్భోచిత కవితా వచనాలతో ఈ కార్యక్రమానికి వన్నెలద్దారు. ఒకరికొకరు దీటుగా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ సాహిత్యాభిమానుల మన్ననలు అందుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన కవి సమ్మేళనం రాత్రి వరకు కొనసాగగా, అనంతరం ముషాయిరా జరిగింది.
కవుల కవితా రaరి అలుపెరుగని ప్రవాహంలా కొనసాగింది. భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యాన్ని, స్వతంత్ర పోరాటాన్ని, సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ఎంతో హుందాగా దేశ భక్తి, జాతీయ సమైక్యతా భావాలను చాటేలా ఈ కార్యక్రమం అలరింపజేసింది. స్వాతంత్య్ర పోరాట ప్రాశస్త్యం, పోరుబాటలో నిజామాబాద్ గడ్డ పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు వీనులవిందుగా తమదైన రీతిలో కవితాత్మకత ధోరణిలో అభివర్ణించారు.
ప్రస్తుత సమాజంలో సాహితీ రంగం పోషిస్తున్న పాత్ర గురించి విడమరచి చెప్పారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సాధించిందని, ప్రస్తుతం భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచానికి తన సత్తా చాటుతోందని అన్నారు. దేశ ప్రగతికి కృషి చేయడమే అమరులకు అసలైన నివాళి అని అన్నారు.
ఎంతో గొప్పదైన దేశ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని సాహితీవేత్తలు దశదిశలా చాటాలని, భారత ప్రతిష్టను ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. కవిత్వం అనేది ఎంతో శక్తివంతమైనది, వేనవేల మాటల్లో చెప్పలేనిది కవిత్వ రూపకంగా అనేక భావాలను వ్యక్తీకరించవచ్చని పేర్కొన్నారు. సమాజ చైతన్యానికి కవులు ఆదర్శవంతమైన రచనల ద్వారా తమవంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఏఓ శ్రీధర్, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ త్రివేణి, ప్రముఖ కవులు పాల్గొన్నారు.