రక్తదాన శిబిరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గాల వారీగా చేపడుతున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని వివరించారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి డిచ్పల్లి సిహెచ్‌సిలో, బోధన్‌ సెగ్మెంట్‌కు సంబంధించి లయన్స్‌ కంటి ఆసుపత్రిలో, ఆర్మూర్‌ నియోజకవర్గం రక్త దాతల కోసం ఆర్మూర్‌ సిహెచ్‌సీలో, బాల్కొండ నియోజకవర్గం వారికి భీంగల్‌ పీహెచ్‌సీలో, బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి వారిని సిహెచ్‌సిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శిబిరాలలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలి

కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి హితవు పలికారు. నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రితో పాటు బోధన్‌ జిల్లా ఆసుపత్రి, ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంకనూ పలు పీహెచ్‌సిల పరిధిలో యాభై శాతానికి పైగా గర్భిణీలు ప్రసవాల కోసం ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకుని నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చొరవ చూపాలన్నారు. గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితంగా సాధారణ ప్రసవాలు జరుగుతాయని నమ్మకం పెంపొందిస్తే తప్పనిసరిగా కాన్పుల సంఖ్య పెరుగుతుందని కలెక్టర్‌ సూచించారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుండే వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

ప్రసవం జరిగే సమయానికి ఏ ఒక్క గర్భిణీకి కూడా రక్తహీనత సమస్య తలెత్తకుండా మొదటి నుండే సరైన వైద్య సేవలు, పౌష్టికాహారం తీసుకునేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్యాటరాక్టు సర్జరీల కోసం ప్రతిరోజూ ఒక్కో డివిజన్‌ పరిధి నుండి కనీసం ఇరవై మంది చొప్పున పంపించే ఏర్పాట్లు చేయాలని జిల్లా ఉప వైద్యాధికారులకు సూచించారు. ఈ-సంజీవని, డీ-హబ్‌, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »