చరిత్ర సృష్టించిన సామూహిక జాతీయ గీతాలాపన

నిజామాబాద్‌, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చరిత్ర సృష్టించింది. అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, ప్రముఖులు, సాధారణ పౌరులు అనే తేడా లేకుండా ప్రజలందరూ పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన వేడుకను విజయవంతం చేశారు.

నివాస ప్రాంతాలు మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్‌ విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు తదితర అన్ని ప్రదేశాల్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఉదయం 11.30 గంటలకు ఒకే సమయంలో అన్ని చోట్లా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయడం అరుదైన రికార్డును నెలకొల్పినట్లయ్యింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ఏ సీ పీలు వెంకటేశ్వర్‌, గిరిరాజ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌, ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్‌ తదితరులు నగర నడిబొడ్డున గల నెహ్రూపార్క్‌ చౌరస్తా వద్ద విద్యార్థిని విద్యార్థులు, స్థానికులు, వ్యాపార వర్గాల వారు, ప్రజలతో కలిసి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

ఓల్డ్‌ ఎల్‌ఐసీ చౌరస్తా వద్ద అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, స్థానికులతో కలిసి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నగర మేయర్‌ నీతూకిరణ్‌ ఖిల్లా చౌరస్తా వద్ద, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి కంటేశ్వర్‌ కూడలిలో, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఫులాంగ్‌ చౌరస్తా సమీపంలోని జోయలుక్కాస్‌ ఎదుట, ఆర్టీసీ ఆర్‌.ఎం ఉషాదేవి ప్రయాణికులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

ఇదే తరహాలో అధికారులు తమతమ కార్యాలయాల్లో సిబ్బందితో జనగణ మన గీతం ఆలపించగా, ప్రైవేట్‌ సంస్థల్లోనూ జాతీయ గీతాలాపన జరిగింది. విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొన్నారు. ప్రతీచోట వందేమాతరం…. భారత్‌ మాతా కి జై…. జైహింద్‌ నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లు ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలంతా ఒకే సమయంలో జాతీయ గీతాలాపనలో పాల్గొనడం చారిత్రకమని, స్వతంత్ర భారత దేశంలో బహుశా ఇదివరకు ఎన్నడూ ఎక్కడా జరగలేదని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్విస్తున్న వజ్రోత్సవాల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని, వారి భాగస్వామ్యంతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో నిజామాబాద్‌ జిల్లా ముందంజలో ఉంటోందన్నారు.

21వ తేదీ వరకు జరిగే మిగతా కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ముఖ్యంగా బుధవారం చేపట్టనున్న రక్తదాన శిబిరాల్లో, ఫ్రీడం కప్‌ క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతవజ్రోత్సవాల స్పూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »