నిజామాబాద్, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 3 నెలల పెండిరగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్‌లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పెండిరగ్ పెట్టడం సరైనది కాదని, శానిటేషన్, పేషెంట్ కేర్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు పనిచేస్తారని అన్నారు.
పెట్టుబడిదారులకు రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు చెల్లించే ప్రభుత్వం వేతనాల మీదనే ఆధారపడ్డ కార్మికులకు మూడు నెలలు అయినా జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. వేతనాలు అందకపోవటంతో కార్మికులు వారి పిల్లలను పాఠశాలల్లో చదివించలేకపోతున్నారని, అద్దె ఇళ్లలో నివాసం ఉండలేక యజమానులు బయటకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త కాంట్రాక్టర్ వచ్చి నెలరోజులవుతున్నా నేటికీ ఎంత వేతనం ఇస్తామనేది తెలుపకపోవడం సరైనది కాదని వెంటనే ప్రభుత్వం చెల్లించడంతోపాటు జీవో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారం కార్మికుల వేతనాలు పెంచాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్ నాయకులు భాగ్యలక్ష్మి, కవిత, శ్రీధర్, అజయ్, శ్రవణ్, రెడ్డి తదితర కార్మికులు పాల్గొన్నారు.