ముగిసిన ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం కప్‌ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిసాయి. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్‌ వర్సెస్‌ పోలీస్‌ కమిషనర్‌ జట్ల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ రసవత్తరంగా సాగింది. కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు తమతమ జట్లకు నేతృత్వం వహిస్తూ గెలుపు కోసం నువ్వానేనా అనే రీతిలో హోరాహోరీగా పోరాడారు.

పోటీలో చివరకు పోలీస్‌ కమిషనర్‌ జట్టు విజయం సాధించింది. అలాగే వాలీబాల్‌ తదితర పోటీల్లోనూ ఆయా జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కలెక్టర్‌, సీపీ లతో కలిసి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్రావు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆయా క్రీడాంశాల్లో ఫైనల్‌ పోటీలను ప్రారంభించారు. సాయంత్రం నుండి రాత్రి పొద్దు పోయేంత వరకు కొనసాగిన క్రీడా పోటీలకు సాంస్కృతిక కార్యక్రమాలు జత కలవడం ఈ ఉత్సవాలకు మరింత ఉత్సాహభారితంగా మార్చింది.

కాకతీయ సామ్రాజ్య వీరవనిత రాణీ రుద్రమదేవి పరాక్రమాన్ని, రaాన్సీరాణీ తెగువ, ఉదంసింగ్‌ ప్రాణ త్యాగ నిరతిని, సైనికుల శౌర్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆయా పాఠశాలల చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించి, త్రివర్ణ పతాకాలు చేతబూని భారతదేశం చిత్రపటం ఆకారాన్ని ఆవిష్కరింపజేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఏసీపీలు వెంకటేశ్వర్లు, గిరిరాజ్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

బాణాసంచా వెలుగుల్లో కాంతులీనిన కలెక్టరేట్‌

స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మైదానంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందోత్సాహాలతో టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా వెలుగులతో కలెక్టరేట్‌ సహా పరిసర ప్రాంతాలన్నీ దేదీప్యమానంగా తలుకులీనుతూ సరికొత్త శోభతో కళకళలాడాయి.

విద్యుత్‌ దీపాలతో సుందరంగా ముస్తాబైన కలెక్టరేట్‌ ప్రాంతానికి బాణాసంచా కార్యక్రమం మరింత వెలుగుజిలుగుల వన్నెలద్దింది. వన్నె చేకూర్చింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పుర ప్రముఖులు పాల్గొని బాణసంచా వెలుగులను తిలకిస్తూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. సుమారు అరగంట పాటు విరామం లేకుండా కొనసాగిన బాణాసంచా పేలుళ్లతో ఆకాశమంతా చీకట్లను ఛేదించుకుని రంగురంగుల వెలుగులను విరజిమ్మింది.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »