సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయం

నిజామాబాద్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ 372 వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్‌లో నెలకొల్పిన సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్‌ గౌడ్‌, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్‌ విఠల్రావు మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పోరాట యోధుడు పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్‌ కనబర్చిన పోరాట తెగువ అనన్యసామాన్యమైనదని కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ, మొఘల్‌ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహారాజ్‌ అని కీర్తిస్తూ, ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్‌ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని గౌడ కులస్థులు ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గౌడ కులస్థుల కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

కల్లు గీతా వృత్తిపై పన్నును రద్దు చేసి, 14 కోట్ల బకాయిలను ఇప్పించారని గుర్తు చేశారు. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు గీతా కార్మికులు ఎవరైనా మృతి చెందితే ఇదివరకు అందించిన రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచారని అన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే ఐదెకరాల భూమిని గౌడ సంఘం కోసం కేటాయించారని తెలిపారు. అయితే ఇంకనూ గీత వృత్తిలో కొనసాగుతున్న వారి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, వాటి సాధన కోసం గౌడ సోదరులు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామానా ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. మొఘల్‌ రాజులను ఎదురించి గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు.

సర్వాయి పాపన్నగౌడ్‌ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గీత కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ హితవు పలికారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఐడిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, విద్యావేత్తలు మారయ్య గౌడ్‌, సత్యనారాయణ గౌడ్‌, జయసింహాగౌడ్‌, బీసీ యువజన విభాగం నేత శ్రీనివాస్‌ గౌడ్‌, బంగారు సాయిలు, జగన్‌ గౌడ్‌, గౌడ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »