ఆకర్షణీయమైన చేతిరాతపై విద్యార్థులకు శిక్షణ

నిజామాబాద్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాతను అందంగా, ఆకర్షణీయంగా ఎలా మల్చుకోవాలనే దానిపై శిక్షణ అందించారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులకు గురువారం స్థానికంగానే ఆర్మూర్‌ పట్టణంలో ప్రముఖ అంతర్జాతీయ చేతిరాత శిక్షకులు, విశ్లేషకులైన నేషనల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ అకాడమీ డైరెక్టర్‌ వై.మల్లికార్జున్‌ రావు ద్వారా శిక్షణ ఇప్పించారు.

చదువులో మేటిగా నిలుస్తూ ప్రతిభను చాటుకుంటున్న బాలబాలికలను మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2008 వ సంవత్సరం నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా విద్యా స్ఫూర్తి పేరుతో ఆర్మూర్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి గత జూలై నెలాఖరున విద్యాస్ఫూర్తి నిర్వహించిన సందర్భంగా హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి చేతి రాతకు సంబంధించి కూడా విద్యార్థులకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో త్వరలోనే శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి కట్టుబడి ప్రస్తుతం విద్యార్థులకు ప్రముఖ చేతిరాత నిపుణులు మల్లికార్జున్‌ రావు ద్వారా శిక్షణ ఏర్పాటు చేయించడం విశేషం. చేతిరాతను ఆకర్షణీయంగా మలచుకోవడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జిల్లా విద్యా శాఖా అధికారి దుర్గా ప్రసాద్‌ పేర్కొన్నారు.

ట్రస్ట్‌ నిర్వాహకుల ఆశయానికి అనుగుణంగా విద్యార్థులకు ప్రస్తుత శిక్షణ తరగతులు ఉపయుక్తంగా నిలిచేందుకు వీలుగా ఉపాధ్యాయులు వారిచే చేతిరాత మెరుగుదలపై క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేసేలా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవితవ్యానికి బాటలు వేస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చొరవ చూపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి అందిస్తున్న సేవలను కొనియాడారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటకలో ఇప్పటివరకు సుమారు వెయ్యికి పైగా పాఠశాలలు, కళాశాలల్లో వర్క్‌ షాపులు నిర్వహించడమే కాకుండా వ్యక్తిగతంగా దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ అందించిన అంతర్జాతీయ శిక్షకులు మల్లికార్జున్‌ రావు ద్వారా స్థానిక విద్యార్థులకు శిక్షణ ఏర్పాటు చేయించడం అభినందనీయమని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న తోడ్పాటును విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాగా, మూడు వారాల అనంతరం మలివిడత శిక్షణ తరగతులకు తాను మళ్ళీ హాజరవుతానని, అప్పటివరకు స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థులతో చేతిరాత మెరుగుదలపై తాను సూచించిన పద్ధతుల్లో ప్రాక్టీస్‌ చేయించాలని ఈ సందర్భంగా మల్లికార్జున్‌ రావు కోరారు.

చేతి రాతను మెరుగుపరుచుకోవడం కష్టమైన పనేమీ కాదని, ఆసక్తి, అభిరుచితో ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు తమ చేతిరాతను ఆకర్షణీయంగా మల్చుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌, ఎం.ఈ.ఓ రాజ్‌ గంగారాం, ట్రస్ట్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రిటైర్డ్‌ ఎం.ఈ.ఓ నర్సింలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »