డిచ్‌పల్లి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మానవతా సదన్‌లో చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకు కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు.
నిజామాబాద్ డివిజన్‌కు చెందిన పంచాయతీరాజ్ కార్యదర్శులు లక్షా 17 వేల రూపాయల విలువ చేసే దుస్తులు, ఇతర ఉపకరణాలు మానవతా సదన్ బాలబాలికలకు సమకూర్చి తమ ఔదార్యాన్ని చాటుకోగా, వాటిని సైతం కలెక్టర్ తన చేతుల మీదుగా చిన్నారులకు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనాధ బాలలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇదివరకు జిల్లాలో కలెక్టర్ గా కొనసాగిన యోగితారాణా తన హయాంలో నెలకొల్పిన మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. సదన్ లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండడం వల్ల అనేకమంది ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు.
తాము అనాథలం, తమకు తల్లితండ్రులు లేరు అనే భావన పిల్లల దరి చేరకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోందని, ఈ దిశగా దాతలు కూడా ముందుకు వచ్చి తోడ్పాటును అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. సంఘ జీవులమైన మనమంతా అట్టడుగున ఉన్న వారిని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
దాతల సహకారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సదన్ బాలలకు హితవు పలికారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కలెక్టర్, ఎస్ పీ, డాక్టర్, ఇంజనీర్ వంటి పదవులతో పాటు రాజకీయ రంగంలోనూ ఎమ్మెల్యే, ఎంపీగా రాణించాలని ఆకాంక్షించారు. మానవతా సదన్ బాలలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతూ, ఇతరులకు ఆదర్శంగా నిలువాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం సదన్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీపీవో జయసుధ, డీఎల్‌పీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ గోపిబాబు, సదన్ సహాయ కేర్ టేకర్ రవి, సి.ఐ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.