కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్ అండ్ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం నుండి 5000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా 5 గురు విద్యార్థులు ఆర్కే డిగ్రీ కళాశాల నుండి శ్రేష్ట, ఉదయ్ కిరణ్, యస్మీన్ సుల్తానా, సాందీపని డిగ్రీ కళాశాల నుండి హర్షిత, తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల (మర్కల్) నుండి సౌజన్య ఎంపిక కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ మాట్లాడారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేవరకు విశ్రమించకూడదని అన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే భవిష్యత్తులో తాము కావాలనుకుంటున్న లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని దాన్ని సాధించడానికి అవసరమయ్యే మార్గాలను అన్వేషించి ఆచరించాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు, ఆర్కే విద్యాసంస్థల కరెస్పాండెంట్ జైపాల్ రెడ్డి, నవీన్, సాందీపని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబా, సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, వైస్ ప్రిన్సిపల్ వనజ, అనిత పాల్గొన్నారు.