నిజామాబాద్, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన రంగోళీ పోటీలు మహిళల సృజనాత్మకతను ఆవిష్కరింపజేశాయి. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని, దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు.
భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా పలువురు రంగవల్లులు వేయగా, మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక బాధ్యతలను గుర్తు చేస్తూ అందమైన ముగ్గులతో ఆలోచనలు రేకెత్తించారు. వివిధ రూపాలతో కూడిన ఆకర్షణీయమైన ముగ్గులతో కలెక్టరేట్ మైదానం రంగుల హరివిల్లును తలపింపజేసింది. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు ముఖ్యఅతిథిగా హాజరవగా, నగర మేయర్ నీతు కిరణ్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్ నేతృత్వంలో ఆయా శాఖలకు చెందిన మహిళా అధికారిణులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ అత్యుత్తమమైన ముగ్గుల ప్రాతిపదికన విజేతలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, రంగోళీ పోటీలకు మంచి స్పందన లభించిందని, అతివలు పెద్ద సంఖ్యలో పాల్గొని వజ్రోత్సవ వేడుకల శోభను మరింతగా ఇనుమడిరపజేశారని ప్రశంసించారు. భారతదేశ గొప్పదనం, త్రివర్ణ పతాకం ప్రాముఖ్యత, బాలికల విద్య ఆవశ్యకత తదితర అంశాలను ప్రతిఫలింపజేస్తూ ఎండను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకట్టుకునే తరహాలో ఎంతో అందమైన ముగ్గులు వేశారని కొనియాడారు.
మేమంతా భారతీయులం.. ఏ సమస్య ఎదురైనా సమిష్టిగా ఎదుర్కొంటాం అనే భావనను చాటుతూ అన్ని వర్గాల వారు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములవుతూ విజయవంతం చేస్తున్నారని, ఇది ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, దేశ అభివృద్ధికి, అన్ని వర్గాల వారి అభ్యున్నతికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన భవాని, స్వప్న, లావణ్య లకు వరుస క్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ప్రణవి, వినీషా, సుస్మితకు కన్సోలేషన్ ప్రైజులు దక్కాయి. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి రaాన్సీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి శశికళ తదితరులు పాల్గొన్నారు.