నిజామాబాద్, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో జమియతుల్ ఉలేమా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బోధన్ రోడ్ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, ఆర్టీసీ న్యూ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది.
ఆయా మదర్సాలకు చెందిన విద్యార్థులు, మైనారిటీ యువకులు త్రివర్ణ పతాకాలు చేతబూని, జాతీయత భావం పెంపొందేలా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకల్లో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు.
భిన్న జాతులు, కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులతో కూడి ఉన్నప్పటికీ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా నిలుస్తుందన్నారు. భారతీయులమంతా ఒక్కటే, దేశాభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని మైనారిటీల ర్యాలీ చాటిందన్నారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, దేశ సమైక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందూ, ముస్లిం అనే భేదభావాలు లేకుండా జిల్లాలో అన్ని మతాలకు చెందిన వారు పరస్పరం కలిసిమెలిసి జిల్లా ప్రగతికి పాటీపడుతుండడం అభినందనీయమని అన్నారు.
ర్యాలీలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జమైతుల్ ఉలేమా ప్రతినిధులు హాఫీజ్ లాయఖ్ అలీ, మౌలానా ఖిజర్, ఖయ్యుం షాకిర్, ఆబిద్ ఖాస్మి, ఇస్మాయిల్, శుకూర్, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.