కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర స్ఫూర్తిని అందించే విధంగా మహిళలు ముగ్గులు వేశారని కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలో మన రాష్ట్ర ముందంజలో ఉందని తెలిపారు. దేశం గర్వించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు.
స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన నాటి యోధుల గురించి గాంధీ సినిమా ను విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చూయించే ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలో విజేతలకు రూపాయల 500 చొప్పున నగదు బహుమతులను ప్రభుత్వ విప్ గోవర్ధన్ అందజేశారు. మున్సిపల్ వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి కే. రమ్య (టేక్రియాల్), ద్వితీయ బహుమతి నందిని (సరంపల్లి), తృతీయ బహుమతి ఏ .దీప (సరంపల్లి) గెలుపొందారు. కళాభారతి వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్. రూప (ఎన్జీవోఎస్ కాలనీ), ద్వితీయ బహుమతి శ్రావణి (విద్యానగర్), తృతీయ బహుమతి అనురాధ (పంచముఖి హనుమాన్ కాలనీ) విజేతలుగా నిలిచారు. వీరికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రూ.500 చొప్పున నగదు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.