నిజామాబాద్, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 9 వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మొత్తం 14 స్క్రీన్లపై ప్రదర్శించిన ఈ చిత్రాన్ని 64,000 మంది విద్యార్థులు తిలకించారని తెలిపారు.
విద్యార్థులలో దేశభక్తిని, స్వతంత్ర స్ఫూర్తిని పెంపొందింపజేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 9 నుండి 11 వరకు, తిరిగి 16 నుండి 21వ తేదీ వరకు సినిమా థియేటర్లలో ఉచితంగా గాంధీ సినిమాను ప్రదర్శించారని కలెక్టర్ వివరించారు. కాగా, వరుసగా మొదటి రెండు రోజుల పాటు కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా జిల్లా కేంద్రంలోని ఉషా మల్టిప్లెక్ థియేటర్ లోని పలు స్క్రీన్ లపై ప్రదర్శిస్తున్న గాంధీ మూవీని వీక్షించి, ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరిపారు.
విద్యార్థుల భద్రతకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. అటెండెంట్ల పర్యవేక్షణలో విద్యార్థులను థియేటర్లకు తరలించేందుకు, తిరిగి పాఠశాలలకు చేర్చేలా రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టడం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఎంతో మంది విద్యార్థులు స్పూర్తి పొందారని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.