నిజామాబాద్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. ముబారక్ నగర్లో గల ఆర్.బి.వీ.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి 154 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణరెడ్డి రాజా బహదూర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
స్వాతంత్య్ర సమరయోధులను, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనేక ఆంక్షలు నెలకొని ఉన్న ఆ సమయంలోనూ రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి విద్య ఆవశ్యకతను గుర్తించి హైదరాబాద్ లో ప్రత్యేకంగా కళాశాలలు, వసతి గృహాలను నెలకొల్పారని అన్నారు.
స్థానికంగా ఆయన పేరిట సొసైటీని స్థాపించి అన్ని వసతులతో కూడిన పాఠశాలను కొనసాగించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని సొసైటీ ప్రతినిధులను కలెక్టర్ ప్రశంసించారు. విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపేలా మరింత విస్తృత స్థాయిలో కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, మనం చేసే మంచి పనులే మనకు ఎక్కువ సంతృప్తిని అందిస్తాయని అన్నారు. విద్య ఎంతో శక్తివంతమైన ఆయుధమని అభివర్ణిస్తూ, చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
మనతో పాటు మన చుట్టుపక్కల వారు బాగుపడాలనే మనస్తత్వంతో ముందుకు సాగితే సమాజం, తద్వారా దేశం సత్వర అభివృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్ పర్సన్ అమృతారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ దేవేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్వరూప్, అమరేందర్ రెడ్డి, సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.