నిజామాబాద్, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలతో కూడిన కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూ కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కలెక్టర్ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలన జరిపారు.
విశాలమైన ప్రాంగణంతో కూడిన కలెక్టరేట్ ఆవరణతో పాటు, కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, తుది పరిశీలన జరుపుతూ ప్రతి విభాగం, ప్రతి గది వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రతి అంగుళాన్ని శుభ్రం చేయించాలని, నీటి వసతి, టాయిలెట్స్, విద్యుత్ వ్యవస్థ, లైటింగ్ పూర్తి స్థాయిలో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి కనీసం ఐదు రోజుల ముందే ఈ నెలాఖరు లోగా న్యూ కలెక్టరేట్ ను అన్ని హంగులు, సదుపాయాలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, మెయిన్ గేట్ నుండి లోనికి వచ్చే మార్గంలో మీడియన్‌ను మరింత అందంగా, పూల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ప్రారంభోత్సవం జరిగిన రోజు నుండే ఆయా శాఖల కార్యకలాపాలన్నీ న్యూ కలెక్టరేట్ భవన సముదాయం వేదికగానే జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని వసతులు అందుబాటులోకి వచ్చేలా యుద్దప్రాతిపదికన తుదిదశ పనులను పూర్తి చేయించాలన్నారు. ఈ సందర్భంగా న్యూ కలెక్టరేట్లోని మినిస్టర్ ఛాంబర్, కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు, కాన్ఫరెన్స్ హాల్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించి, పలుచోట్ల మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నిజామాబాద్ ఆర్డీఓ రవి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.