కామారెడ్డి, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28న జరగబోయే కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 9 గంటలకే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరని పేర్కొన్నారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు, బ్యాగులు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని, తమ హాల్ టికెట్‌పై ఫోటో అతికించుకొని రావాలని, లేనిచో పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. ఎటువంటి ఐడెంటిటీ ధ్రువపత్రాలు అక్కర్లేదని, అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రంపై బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే బబ్లింగ్ చేయాలన్నారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తారు కనుక అభ్యర్థులు చేతివేళ్ళకు మెహేంది, టాటూలు పెట్టుకోవద్దన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ వి. శంకరయ్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎం. చంద్రకాంత్, ఆరోగ్య, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.