నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను పరిశీలించారు.
అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్, తక్షణమే వాటిని సవరించాలని అధికారులకు సూచించారు. రహదారి పొడుగునా ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా విరివిగా మొక్కలు నాటాలని, రోడ్డుకు రెండువైపులా పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కనిపించాలన్నారు. ట్రీగార్డులు, కర్రలను సరి చేసుకుంటూ, దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తగా ఎతైనా మొక్కలు వెంటనే నాటించాలని ఆదేశించారు.
మొక్కల చుట్టూ సాసరింగ్ చేస్తూ, పిచ్చి మొక్కల, గడ్డి లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ శాఖ, ఉపాధి హామీ, పంచాయతీరాజ్, మండల పరిషత్ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి చేయించాలని గడువు విధించారు.
రోడ్డు మధ్యన మీడియన్ ప్రదేశంలో అందమైన పూల మొక్కలతో ఆకట్టుకునే రీతిలో పచ్చదనం సంతరించుకునేలా పనులు జరిపించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైతే ఉపాధి హామీ కూలీలను సమకూర్చడంతో పాటు ఇతరత్రా సహకారాన్ని కూడా జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని, పనులు మాత్రం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్, నేషనల్ హైవే అథారిటీ పీ.డీ సీఎస్.రావు, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హిమచందన తదితరులు ఉన్నారు.