నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురువారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పలుచోట్ల దెబ్బతిన్న పంటల స్థానంలో కొందరు రైతులు తిరిగి పంటలు విత్తుతున్నారని అన్నారు.
క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు, ఏఈఓ లు పంటల సాగును పరిశీలిస్తూ వాస్తవ వివరాలతో కూడిన నివేదికలు రూపొందించాలన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని, పంటల సాగు విషయంలో తగిన సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించాలని, ప్రయోగాత్మక పంటల సాగుకు ముందుకు వచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో వెన్నంటిగా నిలుస్తూ వారు అధిక దిగుబడులు సాధించేలా తోడ్పాటును అందించాలన్నారు.
దీనివల్ల ఇతర రైతులు కూడా ప్రయోగాత్మక పంటల సాగుకు ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఎరువుల వినియోగానికి సంబంధించి తప్పనిసరిగా ఈ-పాస్‌లో వివరాలన్నీ నమోదు చేయాలని, దీని ఆధారంగానే జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రైతులు మోతాదుకు మించి ఎరువులు వినియోగించకుండా వారికి అవగాహన కల్పించాలని హితవు పలికారు.
నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని, దీనివల్ల కలిగే లాభాల గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏకధాటి వర్షాల కారణంగా ఏయే ప్రాంతాల్లో ఎంతమేరకు పంటలకు నష్టం వాటిల్లిందని వివరాలను కలెక్టర్ అధికారులను డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికలను వినియోగంలోకి తేవాలని అన్నారు. కొన్ని చోట్ల టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయలేదని ఏ.ఓ లు కలెక్టర్ దృష్టికి తేగా, కాంట్రాక్టర్లను సంప్రదించి వాటి నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ క్షేత్రాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ పునరుద్ధరింపజేశామని, ఇంకనూ కొన్ని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మునిగి ఉన్నాయని, నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేయిస్తామని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్, ఏ డీ ఏలు, ఏ.ఓలు పాల్గొన్నారు.